
ఈ నెల 29న ఆచార్య సినిమా విడుదల కాబోతుండటంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, పూజ హెగ్డే తదితరులు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి తమ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి “టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాలని ఎందుకు ప్రాధేయపడుతున్నారు?” అని ప్రశ్నించడంతో చిరంజీవికి కాస్త కోపం వచ్చింది. ఆయన ఘాటుగా ఏదో చెప్పబోతే దర్శకుడు కొరటాల చిరంజీవి చేతిలో నుంచి మైక్ తీసుకొని విలేఖరులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కానీ మళ్ళీ చిరంజీవి శివ చేతిలో నుంచి మైక్ తీసుకొని, “ప్రేక్షకులకు మేము అందిస్తున్న వినోదానికి ప్రతిగా మరికొంచెం అదనంగా ఇవ్వాలని కోరాము. తప్పా? కరోనా కారణంగా సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. కనుక కాస్త టికెట్ ధరలు పెంచి ఆర్ధికంగా తోడ్పడమని ప్రభుత్వాన్ని కోరితే దానిలో తప్పేముంది?రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా 42 శాతం పన్ను చెల్లించేది మేమే. దానిలో కొంత టికెట్ ధరల పెంపు ద్వారా మేము వెనక్కు తీసుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?” అంటూ కాస్త ఆగ్రహంగా అన్నారు.
కరోనా, లాక్డౌన్ల వలన సినీ పరిశ్రమ నష్టపోయిన మాట నిజమే కానీ హీరోలు, హీరోయిన్లు కాదు. సినీ పరిశ్రమకు అంత కష్టంలో ఉన్నా హీరో, హీరోయిన్లు నిర్మాతల నుంచి కోట్ల పారితోషికం తీసుకొన్నారు. కనుక ఒకవేళ వారికి తమ సినీ పరిశ్రమను కాపాడుకోవాలనుకొంటే, ముందుగా తమ పారితోషికాలను సగానికి తగ్గించుకొంటే చాలు. టికెట్ ధరలు పెంచవలసిన అవసరం ఉండదు. కానీ తమ పారితోషికాలను తగ్గించుకొని దానిని కాపాడే ప్రయత్నం చేయకుండా, తమ భారాన్ని కూడా ప్రజలే మోయాలని వాదించడమే చాలా తప్పు.