ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ అర్ధాంగి జీవితపై జోస్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (ఫిలిం ప్రొడక్షన్స్) అధినేతలు కోటేశ్వర రాజు, హేమ మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ, “జీవిత పైకి కనిపిస్తున్నంత అమాయకురాలు ఉత్తమరాలు కారు. తన భర్త హీరోగా నటించిన గరుడవేగ సినిమా కోసం ఆమె మా ఇంటికి వచ్చి మా కాళ్ళు పట్టుకొని డబ్బు కోసం ప్రాధేయపడ్డారు. ఆమె మాటలు నమ్మి, వారి ఆస్తి పత్రాలు తనఖా పెట్టుకొని రూ.26 కోట్లు అప్పు ఇచ్చాము. దాని కోసం వారు కొందరు పెద్దమనుషుల సమక్షంలో మాకు రూ.26కోట్లకు అగ్రిమెంట్ పత్రాలను కూడా సంతకం చేసి ఇచ్చారు. కానీ ఇంతవరకు మా అప్పు తీర్చకుండా ఓ సారి కరోనా వచ్చిందని, మరోసారి తమకు సమన్లు అందలేదని కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. నేటికీ మా దగ్గర సొమ్ము తీసుకొన్నామని, దానినిని తిరిగి ఇస్తానని ఆమె చెప్పడం లేదు కానీ కోర్టు కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఆమెకు మేము సమన్లు అందకుండా చేసామని అబద్దాలు చెపుతున్నారు. కోర్టు వారికి పంపిన సమన్లు నేటికీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి కావాలంటే చూసుకోవచ్చు కదా?ఈ వ్యవహారంపై ఆమెతో మేము కోర్టులోనే తేల్చుకొంటాము,” అని అన్నారు.