
టాలీవుడ్లో తరచూ వివాదాలలో చిక్కుకొనేవారిలో డాక్టర్ జీవిత రాజశేఖర్ కూడా ఒకరు. తాజాగా వారు మరో వివాదంలో చిక్కుకొన్నారు. చిత్తూరు జిల్లా నగరికి చెందిన జ్యోస్టర్ ఎండీ హేమ దంపతులు తాము వారి ఆస్తి పత్రాలు తాకట్టుపెట్టుకొని గరుడవేగ సినిమా కోసం రూ.26కోట్లు అప్పు ఇచ్చామని, కానీ వారు ఆ సొమ్ము తిరిగి చెల్లించకుండా ఆ ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి అమ్ముకొన్నారని ఆరోపించారు. దీనికి సంబందించి వారు సంతకాలు చేసి ఇచ్చిన చెక్కులను బ్యాంక్లో డిపాజిట్ చేశామని కానీ అవి బౌన్స్ అవడంతో తిరువళ్ళూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. నగరి కోర్టులో వారిద్దరిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని త్వరలోనే ఇద్దరూ జయలుకి వెళ్ళకతప్పదని జ్యోస్టర్ ఎండీ హేమ దంపతులు చెప్పారు.
జీవిత రాజశేఖర్ వెంటనే స్పందిస్తూ వారి ఆరోపణలను కొట్టి పడేశారు. తాము ఎవరినీ మోసం చేయలేదని, ఈ వివాదానికి సంబందించి పూర్తి సాక్ష్యాధారాలతో శనివారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతామని చెప్పారు. అంతవరకు మీడియా మిత్రులు కాస్త సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.