విజయ్ దేవరకొండ, సమంత జంటగా సినిమా

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, సమంతలకు ఉన్న డిమాండ్, అభిమానులలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారిరువురూ జంటగా సినిమా చేయబోతున్నారంటే ఇక చెప్పక్కరలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో వారు  చేయబోతున్న సినిమాకు గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ దేవుడి పటాలపై క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్‌ చేసి ముహూర్తం షాట్ తీశారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ సినిమా మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. దీనిలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ఆలీ తదితరులు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.  

ఆర్మీ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే రొమాంటిక్ మూవీగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరులోగా కశ్మీరులో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి జూన్‌ నెలాఖరులోగా పూర్తి చేసి ఆ తరువాత హైదరాబాద్‌, విశాఖపట్నం, కేరళలోని ఆలెప్పిలో షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమాకు సంగీతం: వాహేబ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు.