ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి

ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు (84) మంగళవారం అర్దరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  

తాతినేని రామారావు కృష్ణాజిల్లా కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. ఆనాటి ప్రముఖ దర్శకుడు, వరుసకు సోదరుడు అయిన తాతినేని ప్రకాశరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా జేరి ఆ తరువాత ప్రత్యాగాత్మ వద్ద కొంతకాలం శిష్యరికం చేసి తాతినేని రామారావు తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. 

తొలిసారిగా అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి జంటగా ‘నవరాత్రి’ సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి మరి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరమే రాలేదు. తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వంటి అగ్ర హీరోలందరితో ఆయన సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వం  వహించిన తెలుగు సినిమాలలో రైతు కుటుంబం, పచ్చని కాపురం, జీవనతరంగాలు, దొరబాబు, యమగోల, ఆలుమగలు, అమరప్రేమ, ఆటగాడు, న్యాయానికి శిక్ష, అగ్నికెరటాలు వంటి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. 

తాతినేని హిందీలో కూడా అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. వాటిలో హాకీకత్, నసీబ్ అప్నా అప్నా, సంసార్, సదా సౌహాగన్, కత్రోంకి కిలాడీ, మజ్బూర్, ప్రతీకార్, హత్ కడీ, చివరిగా 2000లో బేటీ నంబర్: 1 చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన ఆఖరి రాస్తా, అంధా కానూన్, ఏక్‌  హీ భూల్, జనవరి జానీ జనార్ధన్ సినిమాలను తాతినేని రామారావే నిర్మించారు. 

తాతినేని తెలుగువారైనప్పటికీ బాలీవుడ్‌లో నిలద్రొక్కుకోవడమే కాకుండా తెలుగులో కంటే ఎక్కువగా హిందీలో సినిమాలు తీశారు. వాటిలో చాలా వరకు తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలే. సినీ పరిశ్రమలో కొత్త కధలు, కమర్షియల్ కధలను ప్రవేశపెట్టిన ఘనత కూడా తాతినేని రామారావుదే. 

తెలుగు, హిందీ సినీ పరిశ్రమలతో ఇంతగా అనుబందం పెనవేసుకొన్న గొప్ప దర్శకుడు తాతినేని రామారావు మృతిపట్ల టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.