ప్రముఖ తెలుగు సినీ నిర్మాత నారాయణ్ దాస్‌ మృతి

తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, ఫైనాన్సర్, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్‌ కె నారంగ్ (76) ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్ను మూశారు. గత కొంతకాలం వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

నారాయణ్ దాస్‌ 1980 నుంచి సుమారు 650కి  పైగా సినిమాలకు ఫైనాన్స్ చేశారు. అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు. ఏషియన్ గ్రూప్ కింద మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్స్‌ స్థాపించి సినీ పరిశ్రమతో విడదీయరాని అనుబందం ఏర్పరచుకున్నారు. 

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ, నాగశౌర్య హీరోగా లక్ష్య, నాగార్జున హీరోగా ‘ది ఘోస్ట్’,  సినిమాలకు ఆయనే నిర్మాత. నారాయణ దాస్ ఇద్దరు కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా సినీ నిర్మాతలుగా పలు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.     

నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో ఆయన అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.