అలనాటి మేటి నటుడు బాలయ్య మృతి

అలనాటి మేటి నటుడు మన్నవ బాలయ్య (92) శనివారం ఉదయం హైదరాబాద్‌, యూసఫ్‌గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. బాలయ్య గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

బాలయ్య గుంటూరు జిల్లాలోని చావుపాడు గ్రామంలో 1930, ఏప్రిల్ 9వ తేదీన జన్మించారు. శనివారం తన పుట్టిన రోజునే ఆయన చనిపోవడం విషాదకరం. బాలయ్య చెన్నైలోని గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత సినీ పరిశ్రమలో ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొన్నారు. ముఖ్యంగా జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో ఆయన చేసిన పాత్రలు ఎన్నటికీ మరపురానివి. 

బాలయ్య 1958లో ఎత్తుకు పైఎత్తు సినిమాతో సినీ పరిశ్రమలో ప్రవేశించి 300 సినిమాలకు పైగా చేశారు. బాలయ్య ప్రధానంగా క్యారక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశారు.  చివరకు మిగిలేది, శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కధ, బబ్రువాహన, బొబ్బిలి యుద్ధం, వివాహ బందం, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, మొనగాళ్ళకి మొనగాడు, లక్ష్మీ కటాక్షం, భక్త కన్నప్ప, ఆలూరి సీతారామరాజు, కురుక్షేత్రం, తాండ్రపాపారాయుడు, గాయం, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బాలయ్య చివరిగా 2013లో రామాచారి సినిమాలో నటించారు. అలనాటి మేటి నటులైన ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, సావిత్రి, జమున వంటి వారందరితో బాలయ్య నటించారు.  

బాలయ్య సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలకు కధలు వ్రాసారు. పది సినిమాలు నిర్మించారు. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. 

1971లో విడుదలైన చెల్లెలి కాపురం సినిమాకు ఉత్తమ కధా రచయితగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డు,  1981లో విడుదలైన ‘ఊరికిచ్చిన మాట’ సినిమాకు ఉత్తమ కధ రచయితగా నంది అవార్డు అందుకొన్నారు. ఆయన ప్రతిభకు, సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2012లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రధానం చేసింది.  

బాలయ్య అర్ధాంగి పేరు కమలాదేవి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.