అంటే సుందరానికి లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్

శ్యామ్ సింగరాయ్ సినిమాతో మళ్ళీ గాడినపడ్డ నాచురల్ స్టార్ నాని, దాని తరువాత తనకు బాగా అచ్చివచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ఆ సినిమా పేరు కూడా చాలా విచిత్రంగా ‘అంటే సుందరానికి’ అని పెట్టడం, దానిలో నాని పంచెకట్టుతో అమెరికాలో ఉన్నట్లు చూపించడంతో ఆ సినిమా పట్ల అందరిలో ఆసక్తి పెరిగింది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియోను బుదవారం రిలీజ్ చేశారు. 

పోస్టరులో చూపించినట్లే నాని పంచెకట్టులో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ వద్ద తిరుగుతున్నట్లు చూపించారు. అలాగే సినిమా షూటింగ్, రికార్డింగ్ సందర్భంగా నటీనటులు, టెక్నీషియన్స్ మద్య జరిగే సరదా సన్నివేశాలను కూడా దీనిలో చూపించడం విశేషం. 

ఈ వీడియో సాంగ్‌ మొదట్లోనే నాని ‘నేను నాచురల్ బాసు...నాకు మేకప్ అక్కరలేదంటూ...’ ఏదో చెప్పబోతే, “ఎంత నాచురల్ ఆర్టిస్ట్ అయినా ఎంతో కొంత మేకప్ వేస్తారు తెలీదా..” అంటూ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ మొదలువేసేయడం చాలా ఆకట్టుకొంటుంది. 

హాసిత్ గోలి వ్రాసిన ఈ పాటకు వివేక్ సాగర్ విలక్షణమైన సంగీతం సమకూర్చగా, దానిని చాలా అద్భుతంగా పాడారు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు అరుణ సాయిరాం. ఈ వీడియో సాంగ్‌లో ఆమె కూడా సరదాగా, హుషారుగా పాడుతూ కనిపించారు.        

 వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమాలో నానికి జోడీగా నజిరియా నజీమ్ నటిస్తోంది. రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్, నదియా, సుహాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జూన్‌ 10న అంటే సుందరానికి సినిమా విడుదలవుతోంది.