రాజ్‌ తరుణ్, శివాని జంటగా వెబ్‌ సిరీస్‌

యువహీరో రాజ్‌ తరుణ్, డాక్టర్ రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాని తొలిసారిగా జంటగా నటిస్తున్నారు. అదీ...ఓ వెబ్‌ సిరీస్‌లో! జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి ‘ఆహా నా పెళ్ళంట’ అని పేరు ఖరారు చేశారు. మొత్తం 8 ఎపిసోడ్లలో దీనిని నిర్మిస్తున్నారు. కధేమిటంటే, ఎన్నో ఏళ్ళుగా పెళ్ళి గురించి ఆతృతగా ఎదురుచూస్తున్న హీరోకి పెళ్ళి కుదురుతుంది. కానీ పెళ్ళి రోజున పెళ్ళి కూతురు తన ప్రియుడితో కలిసి పారిపోవడంతో పెళ్ళి ఆగిపోతుంది. ఈ పెళ్ళి తన జీవితంలో ఎంతో మధురానుభూతిగా ఉండాలని కలలు కన్న హీరోకి జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని బాధ, అవమానం మిగల్చడంతో హీరోయిన్ (శివాని)పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకొంటాడు. 

పెళ్ళికి ముందు హీరోయిన్ జంప్ అవడం చాలా పాత కధే అయినప్పటికీ, ఆమెపై హీరో ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, అతని నుంచి హీరోయిన్ తప్పించుకొనే ప్రయత్నాలు చేయడం కొత్త పాయింట్. కనుక వినోదభరితంగా ఉంటుందని భావించవచ్చు. 

ఏబీసీడీ ఫేమ్ దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. మొన్న ఆదివారం నుంచి రాజమండ్రిలో ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ప్రారంభమైంది. మరో 15 రోజులపాటు పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుతామని దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలిపారు.