
ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు నెచ్చెలిగా నటించిన బాలీవుడ్ నటి ఆలియా భట్, సినిమా విడుదలైన తరువాత తన ఇంస్టాగ్రామ్ నుంచి ఆ సినిమాకు సంబందించి గతంలో తాను పెట్టిన పోస్టులన్నీ చెరిపేసి, ఆ సినిమా దర్శకుడు రాజమౌళిని అన్‌ఫాలో చేసింది.
ఈ సినిమాలో రాజమౌళి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలననే ఆమె ఈవిదంగా చేసిందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై ఆమె స్పందిస్తూ మరో పెద్ద మెసేజ్ పెట్టి వివరణ ఇచ్చింది. ఇంతకీ ఆలియా భట్ ఏమి చెప్పిందంటే... “ఆర్ఆర్ఆర్ సినిమా టీం పట్ల నేను అసంతృప్తితో ఉన్నందునే ఇంస్టాగ్రామ్‌లో ఆ మూవీకి సంబందించిన పోస్టులన్నీ చెరిపేశానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నా దృష్టికి వచ్చాయి. నేను ఎప్పటికప్పుడు నా ఇంస్టాగ్రామ్‌లో పాత ఫోటోలు, వీడియోలను సవరిస్తుంటాను. కనుక ఈ కారణంగా నేను అసంతృప్తిగా ఉన్నట్లు ఊహించుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను ఆర్ఆర్ఆర్ సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. అందులో సీత పాత్ర చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాజమౌళి సర్ దర్శకత్వంలో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. తారక్, రామ్ చరణ్‌లతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ సినిమాలో ప్రతీ చిన్న అంశం నాకు ఎంతో సంతోషం కలిగించింది.
ఈ పుకార్లపై నేను స్పందించడానికి కారణం రాజమౌళి సర్, ఆర్ఆర్ఆర్ సినిమా టీం ఏళ్ళ తరబడి ఎంతో కష్టపడి తీసిన ఈ అపురూపమైన సినిమా ఇటువంటి తప్పుడు సమాచారం, పుకార్లతో నష్టపోకూడదనే,” అని మెసేజ్ పెట్టింది.
అయితే రాజమౌళిని తాను ఎందుకు అన్ ఫాలో చేసిందో ఆలియా భట్ చెప్పలేదు. ఓ ప్రముఖ వ్యక్తి మరో ప్రముఖ వ్యక్తిని సోషల్ మీడియాలో ఫాలో అవడం సర్వసాధారణమే కానీ అన్ ఫాలో చేసినప్పుడే అది సంచలన వార్త అవుతుంది. చాలా మంది తమ అసంతృప్తిని లేదా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి అన్ ఫాలో చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆలియా భట్ కూడా బహుశః అందుకే రాజమౌళిని అన్ ఫాలో చేసి ఉండవచ్చు. అయితే ఇటువంటి పుకార్లు, ఊహాగానాల వలన తన కెరీర్‌కి నష్టం జరుగుతుందని భావించి ఈ సంజాయిషీ ఇచ్చి ఉండవచ్చు.