చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌కు సంబందించి తాజా సమాచారాన్ని ఆ సినిమా దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌తో ఉండే ఈ షెడ్యూల్‌ గురువారంతో పూర్తయిపోయిందని, ఆయనతో పని చేయడం మంచి అనుభూతిని కలిగించిందని దర్శకుడు మోహన్ రాజా తెలిపారు. 

 


మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్‌కు తెలుగులో రీమేక్‌గా వస్తున్న గాడ్ ఫాదర్‌ను చిరంజీవి సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా మద్యలో కరోనా సమస్యల వలన షూటింగ్ చాలా ఆలస్యమైంది. 

ఈ సినిమాలో సత్యదేవ్, గంగవ్వ, ఇంద్రజీత్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నీరవ్ షా కెమెరా, ఎస్. ధమన్ సంగీతం అందిస్తున్నారు.