సినిమా థియేటర్లలో స్క్రీన్స్‌ రక్షణకు ముళ్ళ కంచెలు!

అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే వారి అభిమానుల ఉత్సాహానికి అంతే ఉండదు. థియేటర్ బయట తమ అభిమాన హీరో కటవుట్ పెట్టాల్సిందే... పూలదండలు, పాలాభిషేకాలు చేయాల్సిందే. తప్పనిసరిగా మొదటిరోజు మొదటి షో చూసి ఆనందించాల్సిందే. ఇక థియేటర్లో తెరపై తమ అభిమాన హీరో బొమ్మ పడగానే ఈలలు, చప్పట్లు, చిందులతో థియేటర్లు మారుమ్రోగిపోవలసిందే. అంతవరకే అయితే పర్వాలేదు కానీ ఇటీవల కొందరు వీరాభిమానులు స్క్రీన్ మీద హీరోకు పాలాభిషేకం చేస్తున్నారు. 

ఇటీవల విజయవాడలోని అన్నపూర్ణా థియేటర్లో రాధేశ్యామ్ సినిమా విడుదలైనప్పుడు అభిమానులు తెరపై పాలు పోయడంతో తెరపై పెద్ద మరక ఏర్పడింది. స్క్రీన్ చాలా సున్నితంగా ఉంటుంది కనుక దానిని తుడిచి శుభ్రపరిచే అవకాశం ఉండదు. కనుక థియేటర్ యాజమాన్యం మళ్ళీ రూ.15 లక్షల ఖర్చు పెట్టి కొత్త స్క్రీన్‌ ఏర్పాటుచేసింది. 

రాధేశ్యామ్ తరువాత మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ఇద్దరు అగ్రహీరోలు ఉండటంతో అప్పుడే థియేటర్ల వద్ద వారి అభిమానుల హడావుడి మొదలైపోయింది. దీంతో అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం స్క్రీన్‌కి ముందుండే ఖాళీ ప్రదేశంలో మేకులు పాతించి, స్క్రీన్ వరకు ఎవరూ వెళ్ళకుండా ముళ్ళ కంచె కూడా ఏర్పాటు చేసింది. ఇదే విషయం తెలియజేస్తూ ‘అడుగు ముందుకే వేస్తే ప్రమాదం’ అని ఓ బోర్డు కూడా పెట్టింది. థియేటర్ యాజమాన్యంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ లక్షల ఖరీదు చేసే స్క్రీన్ రక్షణకు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకతప్పదని చెపుతోంది.