బాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న ఐశ్వర్య

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలో బాలీవుడ్‌లో ప్రవేశించబోతున్నారు. ఈవిషయం ఆమె స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు. “ఓ సాధీ చల్’ అనే సినిమాకు దర్శకురాలిగా నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ  అద్భుతమైన ప్రేమకధను క్లౌడ్ 9 బ్యానర్‌లో మీనూ అరోరా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వారం చాలా అద్భుతంగా మొదలైంది. నాకు మీ అందరి ఆశీసులు కావాలి,” అని ట్వీట్ చేస్తూ ఓ సాధీ చల్ సినిమా తొలి పోస్టర్‌ను కూడా పెట్టారు.

తమిళ్ సినీ నటుడు ధనుష్, ఐశ్వర్య కొన్ని రోజుల క్రితమే విడిపోయిన సంగతి తెలిసిందే. ధనుష్ నుంచి విడిపోయిన తరువాత చాలా రోజులు మీడియాకు దూరం ఉన్న ఐశ్వర్య ఇటువంటి గొప్ప వార్తతో అభిమానులను పలకరించారు.