
పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు చేసిన భీమ్లా నాయక్ సినిమా గత నెల 25న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సరిగ్గా నెలరోజుల తరువాత ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని ఆనాడే చిత్ర బృందం ప్రకటించింది. ఆ ప్రకారమే ఈ నెల 25న భీమ్లా నాయక్ సినిమాను డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాబోతోందని డిస్నీ+హాట్ స్టార్ సంస్థ స్వయంగా ట్విట్టర్లో ఈరోజు ప్రకటించింది. అదే రోజున ఆహా ఓటీటీలో కూడా భీమ్లా నాయక్ విడుదల చేయబోతోంది. కనుక థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోతున్నవారు హాయిగా ఇంట్లో కూర్చొని చూడవచ్చు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొషీయుమ్’ చిత్రానికి తెలుగు రీమేక్ భీమ్లా నాయక్. దీనిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూర్యదేవర నాగవంశి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. భీమ్లా నాయక్‌కు థియేటర్లలో మంచి స్పందనే వచ్చింది. కనుక ఓటీటీలో కూడా ఆదరణ లభించవచ్చు.