రాధేశ్యామ్‌కి అంత బడ్జెట్‌ అక్కరలేదు: వర్మ

రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల మద్య విడుదలైన రాధేశ్యామ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, “ఆ సినిమాలో ప్రభాస్ పారితోషికాన్ని పక్కనపెడితే మిగిలిన బడ్జెట్‌లో 5వ వంతుతో ఆ సినిమాను తీయవచ్చు. చాలా గాఢమైన ప్రేమ కధకు అంత విజువల్స్ అక్కరలేదు. ఈ సినిమా బడ్జెట్‌లో అధికశాతం దానికే ఖర్చు పెట్టడం చేత విజువల్స్ చాలా గొప్పగా వచ్చాయి కానీ అవి కధలోని భావాలను, భావోద్వేగాలను డామినేట్ చేస్తూ కధను చంపేశాయి. 

అదే...రూ.4-5 కోట్లు వ్యయంతో నిర్మించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు వందల కోట్లు వసూలు చేస్తోంది. ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు దాని గురించి ఎవరికీ పెద్దగా తెలీకపోయినా సినిమా బాగుండటంతో సూపర్ హిట్ అయ్యింది,” అని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా సుదీర్గ అనుభవం కలిగిన వర్మ ఈ సినిమాపై వెలిబుచ్చిన అభిప్రాయాలను సరైనవేనని అందరికీ తెలుసు. అయితే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చనిపోయిందన్నట్లు, ఇతర సినిమాల గురించి తన అభిప్రాయాలు చెపుతున్న వర్మ చాలా ఏళ్ళుగా ఒక మంచి సినిమా తీయలేకపోతున్నాడు. ఇటీవల విడుదలైన వంగవీటి సినిమాను చూస్తున్నప్పుడు ఇది వర్మ తీసిన సినిమాయేనా కాదా? అనే అనుమానం కలుగుతుంది. ఒక్కప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను కుర్చీలలో ఊపిరి బిగపట్టి కూర్చోనేలా చేసి గొప్ప గొప్ప సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు ప్రేక్షకులను గట్టిగా పది నిమిషాలు కూర్చోబెట్టలేకపోతున్నాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.   మళ్ళీ ఆవిదంగా గొప్ప సినిమాలు తీయలేనని వర్మకే అర్ధం అయ్యిందో ఏమో అప్పటి నుంచి నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నలుగురి దృష్టిని ఆకర్షిస్తూ, చెత్త సినిమాలు తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. బహుశః అందుకే రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడాడేమో? అయినా ‘నేను నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తాను చూస్తే చూడండి లేకుంటే మానేయండి...’ అని గొప్పగా చెప్పుకొనే వర్మ మరి ఇతరుల సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు? వాళ్ళు కూడా వాళ్ళిష్టం వచ్చినట్లు తీసుకొంటున్నారని సరిపెట్టుకోవచ్చు కదా?