ఆర్ఆర్ఆర్‌కు జగనన్న అభయహస్తం

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఆర్ఆర్ఆర్ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాలు, విదేశాలలో సైతం ఈ సినిమా ప్రదర్శనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక్క ఏపీలో మాత్రం ప్రభుత్వ నిబందనలతో ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది. దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యల అభ్యర్ధనపై ఏపీ సిఎం జగనన్న సానుకూలంగా స్పందించి ఆ సినిమాకి అభహస్తం ఇచ్చారు. 

ఆర్ఆర్ఆర్‌ సినిమా బడ్జెట్‌ నటీనటుల పారితోషికాలు కాకుండా రూ.336 కోట్లు పైనే ఉంది. కనుక ఈ సినిమాను పెద్ద బడ్జెట్‌ చిత్రంగా పరిగణించి జీవో 13 ప్రకారం మొదటి పది రోజులు ప్రభుత్వం నిర్దేశించిన సినిమా టికెట్‌ ధరలపై అదనంగా మరో రూ.75 వసూలు చేసుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 

అల్లూరి రామరాజు, కొమురం భీమ్ పాత్రలలో నటించిన రామ్ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ సినిమాలో బ్రిటిష్ వారిని హడలెత్తించి, ఇద్దరూ కొదమ సింహాల్లా గర్జించినప్పటికీ బయట వాస్తవ ప్రపంచంలో ఏపీ ప్రభుత్వం గీసిన గీత దాటకుండా బుద్ధిగా సినిమా నడిపించుకోక తప్పదు. అయితే ఇదీ ఓ గొప్ప వరమే అనుకొని సంతోషపడక తప్పదు.