దుల్కర్ సినిమాలపై సొంత రాష్ట్రంలోనే నిషేదం

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న దుల్కర్ సల్మాన్‌కి ఊహించని కష్టం వచ్చిపడింది. కేరళకు చెందిన ఆయనకు సొంత రాష్ట్రంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై ఆయన నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించకూడదని కేరళ సినిమా థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. 

ఆయన నటించిన సెల్యూట్ చిత్రాన్ని ముందుగా అనుకొన్నట్లుగా థియేటర్లకు ఇవ్వకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేసినందుకు వారు ఈ నిర్ణయం తీసుకొన్నారు. నిజానికి సెల్యూట్ చిత్రం జనవరి 14న సంక్రాంతి పండుగకు థియేటర్లలో విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత మళ్ళీ అదే కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తీవ్రత పూర్తిగా తగ్గింది కనుక సెల్యూట్ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్దపడగా, దుల్కర్ తన సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేసి వారికి షాక్ ఇచ్చారు. దీంతో వారు ఆగ్రహం చెంది దుల్కర్ సినిమా ప్రదర్శనపై రాష్ట్రవ్యాప్తంగా నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించారు. మరి దుల్కర్ ఈ సమస్యను ఏవిదంగా అధిగమిస్తారో చూడాలి.