ఇటీవల ముంబైలో క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ జరిగింది. దక్షిణాది నుంచి సమంత ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె గ్రీన్ అండ్ బ్లాక్ టాప్ డ్రెస్సు వేసుకొని ఆ అవార్డుల ఫంక్షన్‌కి హాజరయ్యారు. అయితే ఆమె నిండుగా డ్రెస్ ధరించినప్పటికీ, స్థనాలు కనిపించేలా పైన బ్రావంటిది ధరించడంపై నెటిజన్లు ఆమెపై మండిపడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇంస్టాగ్రాంలో ఘాటుగా జవాబు ఇచ్చారు.
“ఒక మహిళ తీరుతెన్నులపై ఏవిదంగా తీర్పులు వస్తాయో ఒక మహిళగా నాకు బాగా తెలుసు. మహిళలు ధరించే దుస్తులు, వారి జాతి, వారి చదువు, సామాజిక పరిస్థితి, రూపురేఖలు, చివరికి వారి చర్మం రంగు ఏవిదంగా ఉంది వంటి అనేకానేక అంశాలతో జనాలు మహిళలపై తమ అభిప్రాయాలు (తీర్పు) వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ధరించే దుస్తులను చూసి వారు ఎటువంటివారో తీర్పు చెప్పడం పరిపాటిగా మారింది. మనం ఇప్పుడు 2022లో ఉన్నాము. కనుక ఇకనైనా మహిళలను వారు ధరించే దుస్తుల బట్టి తీర్పు చెప్పే బదులు ఎవరికివారు మరింత మెరుగుపడేందుకు కృషి చేస్తే బాగుంటుంది కదా? ఎవరికివారు తమ గురించి తాము ఆత్మపరిశీలన చేసుకొని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలిగితే అదే మానవ పరిణామ క్రమం అవుతుంది. మన ఆలోచనలను, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం వలన ఎవరికీ మేలు కలుగదు. కనుక ఇతరుల గురించి మరింత ఉన్నతంగా ఆలోచించడం అలవరుచుకొందాం,” అని సమంత తన ఆవేదన, ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.
ఒక మహిళను ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అంచనా వేసి తీర్పులు చెప్పడం చాలా తప్పే. అయితే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనే యువతులను వారి శారీరిక ఆకృతి (కొలతలు), అందచందాలు, ధరించే దుస్తులు, వారి జాతి, వారి దేశం, వారి భాష, వారి వ్యక్తిత్వం వంటి పలు అంశాల ఆధారంగానే తీర్పు చెపుతుంటారని అందరికీ తెలుసు. ఆ తీర్పు తమకు అనుకూలంగా వచ్చి అందాల పోటీలో తాము గెలవాలని పోటీలో పాల్గొనే ప్రతీ యువతీ కోరుకొంటుందని, ఆ పోటీలో గెలిస్తే ఆమె ఎంత సంతోషిస్తుందో అందరికీ తెలుసు. ఆ పోటీలలో ఆమె గెలిస్తే ఆమె వలన దేశ ప్రతిష్ట పెరిగిందని యావత్ దేశ ప్రజలు భావిస్తుంటారు. ఆ తీర్పు ఆమె గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది తప్ప ఈవిదంగా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచదు. అందుకే ఆ తీర్పును ఆమెతో సహా అందరూ సంతోషంగా స్వీకరిస్తుంటారు. కానీ ఇటువంటి తీర్పులను ఎవరూ హర్షించలేరు.