ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ మృతి

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) శనివారం హైదరాబాద్‌లో తన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత రెండేళ్ళుగా ఆయన గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి  కందికొండ స్వగ్రామం. 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు ‘మళ్ళీ కూయవే గువ్వా’ అనే పాటతో కందికొండ సినీ గీత రచయితగా ప్రస్థానం ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు 100కి పైగా సినిమాలలో 1,200కి పైగా పాటలు వ్రాశారు. పూరీ జగన్నాథ్-కందికొండల పరిచయం అక్కడితో ఆగిపోలేదు. అక్కడి నుంచే మొదలైందని చెప్పవచ్చు. పూరీ తీసిన అనేక సినిమాలకు కందికొండ పాటలు వ్రాశారు. వాటిలో ఈడియెట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. తన పాటలతో తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టి, తన పాటలతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టిన కందికొండ యాదగిరి మృతి పట్ల సిఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.