చీటింగ్ కేసుపై బెల్లంకొండ ఏమన్నారంటే...

తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఇవాళ్ళ హైదరాబాద్‌లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నాపై అసత్య ఆరోపణలతో కేసు వేసిన శరణ్ కుమార్‌ది మా ఊరే. నేను డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి అతనికి సినిమా టికెట్స్ ఇప్పించేవాడిని. అతనికి నేను ఇవ్వడమే తప్ప ఏనాడూ అతని దగ్గర పైసా తీసుకోలేదు. కానీ అతను నన్ను, నా కొడుకు శ్రీనివాస్ కెరీర్‌ను దెబ్బ తీయడానికి తప్పుడు ఆరోపణలతో కేసు వేశాడు. మా ప్రతిష్టను దెబ్బ తీసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మా దగ్గర డబ్బు గుంజాలని చూస్తున్నాడు. మాకు అతను రూ.85 లక్షలు ఇచ్చినట్లు ఆధారాలు చూపాలి లేకుంటే అతనినిపై పరువు నష్టం దావా వేస్తాను. అతను ఓ రాజకీయ నాయకుడి ప్రోద్బలంతోనే ఈవిదంగా చేస్తున్నాడని నాకు తెలుసు. మాపై పెట్టిన చీటింగ్ కేసుకి సంబందించి ఇంతవరకు నాకు ఎటువంటి నోటీసు రాలేదు వస్తే పోలీసులకి సహకరిస్తాను. ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటాను,” అని అన్నారు. 

అయితే బెల్లంకొండకు రూ.85 లక్షలు ఇచ్చినట్లు శరణ్ కుమార్‌ హైకోర్టుకు బ్యాంక్ లావాదేవీల సాక్ష్యాధారాలు చూపిన తరువాతే బెల్లంకొండపై చీటింగ్ కేసు నమోదు చేయమని సెంట్రల్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. కనుక బెల్లంకొండ సురేషే తాము శరణ్ కుమార్‌ వద్ద నుంచి డబ్బు తీసుకోలేదని హైకోర్టులో నిరూపించవలసి ఉంటుంది.