ఆర్ఆర్ఆర్ చూసేందుకు సిద్దంగా ఉండండి

జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఆర్ఆర్ఆర్ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ఆ సినిమా మేకర్స్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. “అమెరికా, ఇతర దేశాలలో జనవరిలో ఈ సినిమా చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకొన్నవారందరికీ సినిమా విడుదల కాకపోవడంతో డబ్బు వాపసు చేశాము. రోజులు గడిచిపోయాయి కానీ మీ ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్‌ కోసం ఎదురుచూస్తున్న విదేశీ అభిమానులందరికీ ఓ శుభవార్త. మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ మార్చి 25న అద్భుతమైన సినీ అనుభూతిని పొందేందుకు సిద్దంగా ఉండండి,” అని ట్వీట్ చేశారు. 



ఈ సినిమాలో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసినట్లు అందరికీ తెలుసు కానీ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకుల కింద పని చేయలేదు. ఈ సినిమాలో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా చూపించడం విశేషం. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, కొమురం భీమ్‌తో చేతులు కలిపి పోరాడినట్లు ట్రైలర్‌లో చూపారు. గోండు తెగకు చెందిన కొమురం భీమ్‌ను ముస్లిం వేషధారణలో చూపారు. కనుక ఈ రెండు ట్విస్టులు ఏమిటో సినిమా చూస్తే గానీ అర్ధం కాదు. 

ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, ఆలియా భట్, హాలీవు నటి ఒలివియా మోరిస్, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్, ఇంకా శ్రీయా శరణ్, అరుణ్ సాగర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిచిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.