రేపే రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సంక్రాంతి పండుగకి విడుదలకావలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడి మార్చి 11న విడుదలకాబోతోంది. కనుక ఈ సినీ దర్శకనిర్మాతలు రాధే శ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా రేపు బుదవారం మధ్యాహ్నం 3 గంటలకు దీని ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్రా యూనిట్ ట్విట్టర్‌లో ప్రకటించింది. 

 రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ వింటేజ్ లవ్ స్టోరీలో తొలిసారిగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. కానీ వారి మద్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. ఓ హస్త సాముద్రిక నిపుణుడుగా, కృష్ణంరాజు ఓ సాధువుగా నటించారు. కనుక ఈ సినిమా ఎవరి అంచనాలకు అందకుండా ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించారు. 

గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియెషన్స్ రెండూ కలిసి దీనిని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాయి. రాధే శ్యామ్‌ దక్షిణాది భాషల వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీలో అనూమాలిక్, మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ జాతీయస్థాయి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. కనుక దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా రాధేశ్యామ్ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.