
పవన్ కల్యాణ్, నిత్యా మీనన్, రానా సంయుక్తా మీనన్ జోడీలుగా నటించిన భీమ్లానాయక్ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుదవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దీనికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు.
భీమ్లానాయక్ జనవరిలో సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఇదివరకే ఓ ట్రైలర్ విడుదల చేశారు. కానీ అప్పుడు వాయిదా పడి రేపు రిలీజ్ అవుతున్నందున నిన్న మరో ట్రైలర్ విడుదల చేశారు. దీనిలో భీమ్లానాయక్, డేనియల్ శేఖర్ పాత్రలలో పవన్ కల్యాణ్, రానాలు యాక్షన్, డైలాగ్స్ చాలా పవర్ ఫుల్‌గా అభిమానులను ఆకట్టుకొనేలా ఉన్నాయి. చివరిలో రానా, "నాయక్ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ... " అని చెప్పడం చాలా అద్భుతంగా ఉంది.
పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ ట్రైలర్ చూపిస్తే, ఏపీ ప్రభుత్వం ఆయనకు సిన్మా చూపించేందుకు సిద్దం అవుతుండటం విశేషం. భీమ్లానాయక్ రిలీజ్ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా బెనిఫిట్ షోలు వేయరాదని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకే టికెట్లు అమ్మాలని లేకుంటే థియేటర్ల యజమానులపై కటిన చర్యలు తీసుకొంటామని హెచ్చరిస్తోంది.
జనసేనతో రాజకీయాలలో కూడా ఉన్న పవన్ కల్యాణ్ తరచూ వైసీపీ ప్రభుత్వంపై, సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీ ప్రముఖులు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లు పెంచాలని, బెనిఫిట్ షోలకు అనుమతించాలని విన్నవించుకొన్నా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. బహుశః భీమ్లా నాయక్ కోసమే నిర్ణయం తీసుకోకుండా కమిటీలు, చర్చల పేరుతో తాత్సారం చేస్తోందేమో?