
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందించిన భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కనుక ఈ నెల 21 హైదరాబాద్ పోలీసు గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. సినీ నిర్మాత నాగ వంశీ, ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్ళి మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ను తెలుగులో భీమ్లా నాయక్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. భీమ్లా నాయక్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.