
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి (69) బుదవారం ఉదయం ముంబైలో అనారోగ్యంతో కన్నుమూశారు. గత సంవత్సరం కరోనా బారిన పడినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుండి ముంబై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
బప్పీలహరి 1952లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జల్పాయిగురిలో జన్మించారు. తల్లిదండ్రులు సంగీత కళాకారులు కావడంతో బప్పిలహరి చిన్నప్పటి నుండే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. తర్వాత చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. ఆయన మాతృభాష బెంగాలీ అయినప్పటికీ తెలుగు, హిందీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. బాలీవుడ్‌కు తొలిసారిగా ఆయనే డిస్కో పాటలు, సంగీతాన్ని పరిచయం చేశారు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘బిగ్ బాస్’ వంటి సినిమాలకు బప్పీ లహరి అందించిన ట్యూన్స్‌తో తెలుగు ప్రేక్షకులల మన్ననలు పొందారు. బప్పీ లహరి చివరిగా 2020లో ‘బాగి-3’ అనే హిందీ చిత్రానికి సంగీతాన్ని అందించి అందులో ఒక పాట కూడా ఆలపించారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.