ప్రముఖ బాలీవుడ్ నటుడు, అథ్లెట్ ప్రవీణ్ కుమార్ సోబ్ది (75) గత రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ప్రవీణ్ కుమార్ మంచి అథ్లెట్. ఆయన 1966 మరియు 1970లో ఆసియా క్రీడలలో డిస్కస్ త్రోలో బంగారు పతకాలు, 1966లో కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించారు క్రీడలలో ఆయన ఉత్తమ ప్రదర్శనకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘అర్జున అవార్డు’ ఇచ్చి ఘనంగా సత్కరించింది.
ప్రవీణ్ కుమార్ సోబ్ది క్రీడల నుంచి తప్పుకొన్నాక, సరిహద్దుల భద్రతా దళంలో డిప్యూటీ కమాండెంట్‌గా పని చేశారు. నటనలో కూడా మంచి ప్రావీణ్యం ఉండటంతో ఆ తరువాత పలు బాలీవుడ్ సినిమాలలో నటించారు. ఆయన శరీర ఆకృతిని చూసిన బాలీవుడ్ దర్శకుడు బీఆర్ చోప్రా మహాభారత్ సీరియాల్లో భీముని పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేశారు ప్రవీణ్ కుమార్. మహాభారతం సీరియల్ దూరదర్శన్‌లో 1988 నుంచి 1990 వరకు ప్రసారమైంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.