నా వల్ల ప్రాబ్లెమ్ అయితే వెళ్ళిపోతా...

నవతరం కమెడియన్ల లో రాహుల్ రామకృష్ణ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో రామకృష్ణ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తాజాగా ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన ఎవరూ ఊహించని విషయాన్ని వెల్లడించారు. ఈ సంవత్సరంలోనే తన నటనకు ముగింపు పలకనున్నట్లు  ప్రకటించారు. ఎవరేమనుకొన్నా తన నిర్ణయం మారదని స్పష్టం చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కమెడియన్ అయిన రామకృష్ణ అందరినీ ఆట పట్టించడానికే ఇలా ప్రకటించారా లేక నిజమా? తెలియవలసి ఉంది. సూపర్ హిట్ జాతిరత్నాలు సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి స్నేహితుడిగా వేసిన రామకృష్ణ “’నా వల్ల ప్రాబ్లెమ్ అయితే నేను వెళ్లిపోతాను...” అంటూ పదేపదే చెప్పిన డైలాగ్ ఇప్పుడు మళ్ళీ జ్ఞప్తికి వస్తోంది.


సినీ పరిశ్రమలో ఆయన ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడా లేక ఇక చాలనుకొని సినిమాలకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలనుకొంటున్నాడా లేదా ఏదైనా వెబ్‌ సిరీస్‌ చేయాలనుకొంటున్నాడా? అనే విషయం ఆయనే చెప్పాలి. 

రాహుల్ రామకృష్ణ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండకు స్నేహితుడి పాత్రలో తెలంగాణ యాసతో డైలాగులు చెప్పి ప్రేక్షకుల మెప్పు పొందారు. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తరువాత ‘జాతి రత్నాలు,’ ‘కల్కి’ సినిమాలలో ఆయన చేసిన పాత్రలతో మంచి గుర్తింపు పొందారు.