
ఎర్రచందనం అక్రమ రవాణాతో వాటి స్మగ్లర్స్ ఎంత సంపాదిస్తున్నారో కానీ ఆ కధతో తెరకెక్కిన పుష్ప (ద రైస్) సినిమా 50 రోజులలోనే రూ.365 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరో, హీరోయిన్లు నటించిన ఈ చిత్రం శుక్రవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సునీల్, అనసూయ, ఫాహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప’ ఫీవర్ కొనసాగుతుంది. ఈ సినిమాలో ‘చూపే బంగారమాయేలే... శ్రీవల్లి...’ అనే పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు పలువురు క్రికెటర్లు, చివరికి టాంజానియా దేశానికి చెందిన ఓ వ్యక్తి కూడా అనుకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.