ఫిబ్రవరి 18న వస్తున్న సన్ ఆఫ్ ఇండియా

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్ర చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థతో కలిసి మంచు విష్ణు నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా, ఇళయరాజా సంగీతం అందించారు. 

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, అలీ ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు రెండేళ్ల తర్వాత మోహన్ బాబు మళ్ళీ ఈ సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంభాషణలు ఆలోచించేలా ఉంటాయని, అలాగే పోరాట సన్నివేశాలు, ఊహకందని మలుపులు ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.