మెగా బ్రదర్స్ సినిమాల విడుదలకు డేట్స్ ఫిక్స్

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల ఆచార్య, భీంలా నాయక్ సినిమాల విడుదలకు తేదీలు ఖరారయ్యాయి. మార్చి 22వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల చేయాలని భావిస్తున్నందున ఆచార్యను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు.  



పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్ జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉండగా ఆర్ఆర్ఆర్ కోసం దానిని వాయిదా వేసుకొన్నారు. కానీ కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రెండూ వాయిదా పడ్డాయి. ఇప్పుడు మార్చి 22వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదలవుతున్నందున భీమ్లానాయక్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఆ రోజు విడుదల చేయలేకపోతే ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. 

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లానాయక్ సినిమాల విడుదలను బట్టి మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట రిలీజ్ ఆధారపడి ఉంటుంది. అదీ...ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటేనే సాధ్యం అవుతుంది.  

ఈవిదంగా కరోనా కారణంగా పెద్ద సినిమాలు విడుదల చేసుకోలేకపోవడం వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. మరోపక్క సినిమాను ఖచ్చితంగా ఎప్పుడు విడుదలచేయవచ్చో తెలీని పరిస్థితుల వలన వేరే సినిమాల విడుదలకు అవరోధంగా మారుతున్నాయి. దీంతో సినీ నిర్మాతలు, ఆయా సినిమా నటుల మద్య సత్సంబంధాలు, పరస్పర సహకరించుకోవడం తప్పనిసరైంది లేకుంటే అందరూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.