కొండా చిత్రం ట్రైలర్ విడుదల

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఆయన భార్య కొండా సురేఖల జీవిత కధ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తీసిన కొండా చిత్రం ట్రైలర్ ఈరోజు హన్మకొండలో విడుదలైంది. దీనిని వర్మ, సినిమా యూనిట్ సభ్యులతో కలిసి కొండా దంపతులు చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ట్రైలర్‌లో రాంగోపాల్ వర్మ వాయిస్ ఓవర్‌తో కొండా మురళి ఏ పరిస్థితులలో నక్సలైట్‌గా మారారో చెప్తారు. 

ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, “కొన్ని సంవత్సరాల క్రితం గణతంత్ర దినోత్సవంనాడు వంచనగిరి వద్ద కొండా మురళిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆయనపై ప్రత్యర్ధులు మొత్తం 47 బుల్లెట్లు కురిపించారు. కానీ అదృష్టవశాత్తు ఆరోజు ఆయన బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగారు. నేటికీ వాటిలో కొన్ని ఆయన శరీరంలోనే ఉండిపోయాయి. ఆ బుల్లెట్లకు ముందు తరువాత కధే ఈ సినిమా,” అని అన్నారు.