విడిచిపెట్టని నెటిజన్లు…తగ్గేదేలే అంటున్న అనసూయ

యాంకర్, నటి అనసూయ తరచూ విమర్శలు ఎదుర్కొంటుంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి అందరికీ తెలుసు. తాజాగా మరోసారి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఆమె నిన్న గణతంత్ర’ దినోత్సవం సందర్భంగా గాంధీజీ బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించి, కూర్చొని వందేమాతరం గేయాన్ని పాడి అందరికీ శుభాకాంక్షలు తెలపడమే. 


గణతంత్ర’ దినోత్సవం రోజున జాతీయ గీతం జనగణమన పాడే బదులు ఆమె వందేమాతరం పాడటం, అదీ..కుర్చీలో కూర్చొని పాడటాన్ని తప్పు పడుతూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీజీని స్మరించుకోవడం సందర్భోచితంగా ఉంటుంది గానీ గణతంత్ర’ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేడ్కర్‌కు బదులు మహాత్మా గాంధీని తలుచుకోవడం ఏమిటని నెటిజన్లు ప్రశిస్తున్నారు. అసలు గాంధీజీకి గణతంత్ర దినోత్సవానికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

వీటిపై అనసూయ స్పందిస్తూ, “మీకు నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను నిలుచొని పాడనందుకు మీరు ఫీల్ అయినట్లున్నారు. అందుకు క్షమాపణలు చెపుతున్నాను. అయినా జాతీయ గీతం జనగణమనకు లేచి నిలబడి దేశం పట్ల గౌరవం చాటుతాము. కానీ నేను పాడింది జాతీయగీతం కాదు జాతీయ గేయమైన వందేమాతరం. దీన్ని మీరు అందరూ గమనించాలి. నాకు కూడా దేశం పట్ల ఎంతో గౌరవం ఉంది,” అని అనసూయ బదులిచ్చారు. 

అయినా నెటిజన్లు ఆమెను విడిచిపెట్టకపోవడంతో “జాతీయ గీతానికి, జాతీయ గేయానికి తేడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. గాంధీజీ స్వాతంత్రం సాధించారు కనుకనే జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నాము. కాస్త బుర్ర ఉపయోగించండి...” అంటూ అనసూయ ఘాటుగా బదులిచ్చారు.