
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్ళి కలిసి సినిమా టికెట్ ధరల తగ్గింపుపై చర్చించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నన్ను సోదరుడిలా ఆదరించారు. ఆయన సతీమణి భారతి స్వయంగా నాకు ఆప్యాయంగా వడ్డించారు. ఈ భోజనసమావేశంలో సినీ పరిశ్రమ సాధకబాధకాలన్నీ ఏపీ సిఎం జగన్‌కు నేను వివరించగా, ఆయన చాలా శ్రద్దగా నేను చెప్పినదంతా విన్నారు. త్వరలోనే టికెట్స్ ధరలపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు. మా భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. ఆయన మాటలతో నాకు చాలా నమ్మకం, ధైర్యం కలిగింది. త్వరలోనే సినీ పరిశ్రమలో పెద్దలని కలిసి మేము చర్చించిన విషయాలన్నీ వివరిస్తాను. అవసరమైతే మరోసారి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాట్లాడుతాను. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చాలా సానుకూలంగా స్పందించారు. కనుక సినీ పరిశ్రమలో ఎవరూ కూడా నోరుజారవద్దని సినీ పరిశ్రమ బిడ్డగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.