నేడు ఏపీ సిఎం జగన్‌తో చిరంజీవి భేటీ

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై అధికార వైసీపీకి, సినీ పరిశ్రమలో వారికి మద్య ఓ పక్కన మాటల యుద్ధం జరుగుతుండగానే, మరోపక్క సినీ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరు అమరావతికి వెళ్ళి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 

మూడు రోజుల క్రితం దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ అమరావతికి వెళ్ళి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యి ఇదే అంశంపై చర్చించారు. ఈరోజు మెగా స్టార్ చిరంజీవి ఇదే అంశంపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో నేరుగా మాట్లాడేందుకు అమరావతి వెళుతున్నారు. 

టికెట్ ధరల తగ్గింపుపై ఎవరేమన్నారంటే...   

మంత్రితో రాంగోపాల్ వర్మ సమావేశం ముగిసిన తరువాత వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సినిమావాళ్లు బలిసి కొట్టుకొంటున్నారు. సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు అందరూ హైదరాబాద్‌లో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు వారికి ఆంధ్రప్రదేశ్‌ అనే ఓ రాష్ట్రం...దానికో ముఖ్యమంత్రి ఉన్నారనే సంగతి తెలుసో తెలీదో? అక్కడ సినిమాలు తీసి ఇక్కడ విడుదల చేసి ప్రజలను నిలువునా దోచుకొంటున్నారు,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ స్పందిస్తూ, “మేము కాదు...మీ రాజకీయ నాయకులే బలిసి కొట్టుకొంటున్నారు. సినిమాల సక్సస్ రేట్ ఎంత తక్కువగా ఉన్నప్పటికీ సినిమాలపై మోజుతో నష్టాలు భరిస్తునే మేము సినిమాలు తీస్తూనే ఉన్నాము. మా వలన సినీ పరిశ్రమలో వేలాదిమంది జీవిస్తున్నారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంత అహంకారంతో మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.   

ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, “మేము కోట్లు పెట్టుబడి పెట్టి కష్టపడి సినిమాలు తీసి, పైసాపైసా ఏరుకొంటున్నామే తప్ప మీ రాజకీయ నాయకుల్లా అక్రమస్తులు పోగేసుకోవడం లేదు. రాజకీయాలలో వచ్చే ముందు మీ ఆస్తులు ఎంతున్నాయి? ఇప్పుడు ఎంతున్నాయి...చెప్పగలారా?కానీ కోట్లు పెట్టుబడి పెట్టి దశాబ్ధాలుగా సినిమాలు తీస్తున్నవారి పరిస్థితి ఏమాత్రం మారలేదు. సినిమావాళ్ళు అందరికీ లోకువైపోయారు. రాజకీయాలలో ఉన్నవారు నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు,” అని అన్నారు. 

బాలకృష్ణ స్పందిస్తూ, “ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు కనుక సినీ పరిశ్రమలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొన్న తరువాత కలిసి వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడితే మంచిది. ఒకరి తరువాత మరొకరు వెళ్ళి మాట్లాడటం వలన ప్రయోజనం ఉంటుందనుకోను,” అని అన్నారు. 

రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, “కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన సినిమాకు, 500 కోట్లు బడ్జెట్‌తో తీసిన సినిమాకు ఒకటే టికెట్ రేటు అంటే ఎలా?” అని ఇవాళ్ళ ట్వీట్ చేశారు. 

ఈవిదంగా యుద్ధం కొనసాగుతుండగా సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా భావింపబడే చిరంజీవి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పించి ఇక్కడితో ఈ సమస్యను, వివాదాలను పరిష్కరించగలరా లేదా? చూడాలి.