మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి

హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో కన్ను మూశారు. రమేష్ బాబు గత కొంత కాలంగా కాలేయం (లివర్) సమస్యతో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశారు.   

సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కుమారుడైన రమేష్ బాబును 1974లో బాల నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. కృష్ణ నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రాలు అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడి చేసిన మనుషులు తదితర సినిమాలలో రమేష్ బాబు బాలనటుడిగా నటించారు. మళ్ళీ కొన్నేళ్ళ తరువాత సామ్రాట్ చిత్రంతో హీరోగా తన సినీ కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిగా తన తండ్రి కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి నటనకు స్వస్తి పలికి 2001లో నిర్మాతగా మారి తన సినీ కెరీర్‌లో మూడో ఇన్నింగ్స్ ప్రారంభించి అర్జున్, అతిధి వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. 

సూపర్ స్టార్ కృష్ణకు ఈ వయసులో పుత్రశోకం కలుగడం, మహేష్ బాబుకు ఎల్లప్పుడూ అండగా నిలబడే సోదరుడిని కోల్పోవడం చాలా బాధాకరమే. బాల నటుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి హీరోగా ఎదిగి, విజయవంతమైన నిర్మాతగా నిలిచారు రమేష్ బాబుకు సినీ పరిశ్రమలో ప్రముఖులు నివాళులు ఆర్పిస్తున్నారు.