సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప (ద రైజ్; పార్ట్-1) శుక్రవారం రాత్రి 8 గంటలకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేశారు. పుష్ప డిసెంబర్ 17న థియేటర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. నాలుగు వారాలు కూడా పూర్తవక మునుపే ఓటీటీలో విడుదల చేయడం విశేషం. దీని డిజిటల్ స్త్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ రూ.22 కోట్లు నిర్మాతలకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగకు ముందే పుష్పను ఓటీటీలో విడుదల చేయడానికి నాలుగు కారణాలు కనబడుతున్నాయి.
1. అమెజాన్ భారీగా డబ్బు ముట్టజెప్పడం.
2. సంక్రాంతికి విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడటం వలన పుష్పకు పోటీ లేదు. పైగా అల్లు అర్జున్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా సంక్రాంతికి థియేటర్లలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టగలదనే నమ్మకం. బహుశః అందుకే అమెజాన్ ప్రైమ్‌లో దీని రిలీజ్ గురించి ఎటువంటి ప్రకటనలు ఇవ్వడంలేదేమో? ఓటీటీలో రిలీజ్ అయ్యిందని తెలిసినవారు దానిలో చూస్తారు తెలీనివారు థియేటర్లలో చూస్తారని నిర్మాతలు భావిస్తుండవచ్చు.
3. ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు వలన పుష్పకు కూడా నష్టం కలుగుతుంది. కనుక ఓటీటీ ద్వారా కొంతైనా ఆ నష్టం పూడ్చుకోవచ్చునని భావించి ఉండవచ్చు.
4. పుష్పను చిత్తూరు యాసలో తీయడం వలన చాలామందికి సంభాషణలు అర్ధం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో సినిమా ఎంతబాగున్నప్పటికీ మిశ్రమ స్పందన వస్తోంది. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో మంచి రేటు వచ్చినప్పుడే ఓటీటీకి ఇచ్చి ఉండవచ్చు.