
గత నెల రోజులుగా ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడంపై సినీ ప్రముఖులకి, అధికార వైసీపీ మంత్రులకు మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ తరువాత తాజాగా నాగార్జున ఈ సమస్యపై మాట్లాడారు. నిన్న బంగార్రాజు ప్రమోషన్ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, “ఏపీలో టికెట్ రేట్లతో నా సినిమాకు ఎటువంటి ఇబ్బందీ లేదు. టికెట్ రేట్లు ఎక్కువుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. తక్కువుంటే తక్కువ వస్తాయి అంతే. ఎంతో శ్రమించి తీసిన సినిమాను సమస్యలున్నాయని జేబులో పెట్టుకొని కూర్చోలేము. నేను ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకు సాగుతుంటాను. కనుక దేవుడిపై భారం వేసి జనవరి 14నే బంగార్రాజును విడుదల చేయాలని నిశ్చయించుకొన్నాము. సంక్రాంతి పండుగకి రావలసిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడటం నాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు.
సినిమా టికెట్ ధరలను తగ్గించడంపై ఓ పక్క సినీ పరిశ్రమలో ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతుంటే, నాగార్జున ఈవిదంగా మాట్లాడటం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. స్వయంగా అనేక సినిమాలు నిర్మిస్తున్న నాగార్జునకు టికెట్ ధరల తగ్గింపుతో సినీ పరిశ్రమకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలిసి ఉన్నప్పటికీ తన స్వార్ధం తాను చూసుకొన్నట్లుగా మాట్లాడటం ఆశ్చర్యకరమే.