ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ ఈనెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకావలసి ఉంది కానీ మళ్ళీ కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో పలు రాష్ట్రాలలో థియేటర్లు మూతపడుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇంతకాలం ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులను, ప్రేక్షకులకు నిరాశ కలిగించినందుకు చాలా బాధ కలుగుతున్నప్పటికీ ఈ సినిమాతో ముడిపడి ఉన్న అందరి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలిపారు.  

పది పదిహేను రోజుల క్రితం వరకు కూడా ఈ సినిమాను జనవరి 7నే విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు, నటీనటులు అందరూ భావించి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ చాలా జోరుగా సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ సినిమా వాయిదా వేసుకోవలసి రావడంతో దానికి చేసిన ఖర్చు, వారి శ్రమ అన్నీ వృధా అయ్యాయి. రాబోయే నెలరోజుల్లో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు మళ్ళీ పెరుగుతాయని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత కూడా కరోనా, ఒమిక్రాన్‌ తీవ్రత తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఒకటి రెండు నెలల సమయం పట్టవచ్చు. కనుక ఆర్ఆర్ఆర్ మార్చిలోగా విడుదలయ్యే అవకాశం కనబడటం లేదు. ఇదే కనుక జరిగితే అప్పుడు మార్చి-ఏప్రిల్ నెలల్లో విడుదల కావలసిన సినిమాలు ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేసుకోవలసి రావచ్చు. వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఏళ్ళ తరబడి శ్రమపది తీసిన ఆర్ఆర్ఆర్ వాయిదావేసుకోవలసి రావడం దాని నిర్మాతలకు చాలా నష్టం కలిగించవచ్చు. కనుక పరిస్థితులు తొందరగా సాధారణ స్థితికి చేరుకొని అన్ని సినిమాలు విడుదల కావాలని కోరుకొందాం.