
నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దానిని అదే పేరుతో హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తీశారు. తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి దానికీ దర్శకత్వం వహించారు. కానీ జెర్సీలో హీరోకు ఎదురైన కష్టాల కంటే ఎక్కువ కష్టాలు హిందీ జెర్సీకి ఎదురవుతున్నాయి. 2019లో సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే దేశంలో కరోనా ప్రవేశించడం...దాంతో లాక్‌డౌన్ విధింపు, మళ్ళీ కరోనా...మళ్ళీ లాక్‌డౌన్‌ల మద్య అతికష్టం మీద షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి ఇక డిసెంబర్‌లో 31న జెర్సీ విడుదల చేద్దామని సిద్దమవగానే మహారాష్ట్ర, ఢిల్లీతో సహా దేశంలో ఉత్తరాది రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో మళ్ళీ పాక్షిక లాక్‌డౌన్‌లు, నైట్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. దీంతో అనేక థియేటర్లు మూతపడుతున్నాయి. ఒమిక్రాన్ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. దీంతో జెర్సీ విడుదలకు మూడు రోజుల ముందు సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
జెర్సీ తెలుగులో సూపర్ అయినందున హిందీలో కూడా బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. కనుక ఇటువంటి సమయంలో విడుదల చేయడం మంచిది కాదని వెనక్కు తగ్గారు.