మీ విలాసాలు తగ్గించుకోవచ్చు కదా? సిద్దార్థ్ ప్రశ్న

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఏపీ మంత్రులకు, తెలుగు సినీ నటులకు మద్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నటుడు నాని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ చేసిన విమర్శలపై ఏపీ మంత్రులు ఎదురుదాడి చేశారు. 

“సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చులో 30 శాతంకు పైగా హీరోల రెమ్యూనరేషన్‌కే పోతోందని, సినీ పరిశ్రమపై వారికి అంతగా ప్రేమ ఉంటే వారు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవచ్చు కదా? భీమ్లానాయక్ సినిమాకి ఎంత ఖర్చయ్యింది. ఆ సినిమా చేయడానికి పవన్‌ కళ్యాణ్‌ ఎంత తీసుకొన్నారు?”అని ఓ మంత్రి ప్రశ్నించారు. 

దీనికి జవాబుగా నటుడు సిద్దార్థ్ స్పందిస్తూ, “క్రికెట్ స్టేడియంలలో సౌకర్యాలు తగ్గించి క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ ధరలు తగ్గించగలరా?క్రికెటర్ల జీతాల గురించి ప్రశ్నించగలరా? క్రికెటర్లకు మాత్రమే నైపుణ్యం ఉంది మాకు లేదా?అయినా సినీ పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వానికి ఇంత ఏహ్యత ఎందుకు?” అని ట్వీట్ చేశాడు. 

మరో ట్వీట్‌లో, “మేము కూడా పన్నులు చెల్లిస్తున్నాము. వాటితో మీరు విలాసవంతంగా జీవిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీ విలాసాలు కాస్త తగ్గించుకొని సినిమా టికెట్ ధరలపై డిస్కౌంట్ ఇవ్వొచ్చు కదా?” అని ఘాటుగా మెసేజ్ పెట్టాడు. 

ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ ఛార్జీలతో థియేటర్ల కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేమంటూ ఏపీలో అనేక థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా థియేటర్స్ మూసేస్తున్నారు. మరో పక్క అధికారులు థియేటర్స్‌పై వరుసగా దాడులు చేస్తూ సీజ్ చేస్తున్నారు. ఈ కారణంగా కూడా అనేక థియేటర్లు మూతపడుతున్నాయి. మొత్తం మీద ఏపీలో సినీ సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు. ఇటు మంత్రులు, అటు సినీ నటులు పరస్పరం చేసుకొంటున్న విమర్శలతో రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో?