ఏపీలో పండుగ వేళ మూతపడుతున్న థియేటర్లు

ఈ పండుగ సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు చాలా ముఖ్యమైనది. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం సినీ నియంత్రణ చట్టం (జీవో:35) తెచ్చి టికెట్ ధరలు తగ్గించి, సినీ థియేటర్లపై దాడులు చేస్తుండటంతో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నిన్న 45 థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేసుకొన్నారు. ఇవికాక రాష్ట్రవ్యాప్తంగా ఎంఆర్‌ఓలు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, అగ్నిమాపకశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు థియేటర్లపై దాడులు నిర్వహిస్తూ అనేక థియేటర్లను సీజ్ చేశారు. అనేక థియేటర్లకు నోటీసులు పంపించారు. దీంతో కొందరు ఈ వేధింపులు భరించలేక థియేటర్లు మూసుకొంటున్నారు. ఈ పరిణామాలపై ఏపీలో థియేటర్స్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోలేదని, మరో పక్క ఓటీటీలతో థియేటర్లకు వచ్చేవారు తగ్గిపోతున్నారని ఇప్పుడు అతి ముఖ్యమైన ఈ పండుగ సీజనులో టికెట్ ధరలు తగ్గించి, థియేటర్లపై దాడులు చేస్తూ తమను దెబ్బ తీస్తోందని థియేటర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం చెపుతున్న ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ఏసీ థియేటర్లలో రూ.10, 15, 20 అదే మునిపాలిటీ పరిధిలో అయితే రూ. 30,50,70, కార్పొరేషన్ పరిధిలో రూ.40,60,100ల కు టికెట్స్ విక్రయించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో టీ త్రాగలన్నా కూడా కనీసం రూ.10లు ఉందని మరి ఏసీ థియేటర్లలో అంత తక్కువ ధరకు టికెట్లు అమ్మితే థియేటర్లు ఎలా నడుపగలమని ఓ థియేటర్ యజమాని ప్రశ్నించారు. అంత తక్కువ ధరలకు టికెట్లు అమ్ముకొంటే కనీసం థియేటర్ల విద్యుత్ బిల్లు చెల్లించడానికి కూడా ఆ సొమ్ము సరిపోదని అన్నారు. 

కానీ ఏపీ మంత్రులు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొంటున్నారు. కనుక ఏపీ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండబోదని స్పష్టం అవుతోంది. కనుక సినీ పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగనాటికి ఏపీలో థియేటర్లు మూతపడవచ్చు. మరి సంక్రాంతికి వస్తున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, బంగార్రాజు పరిస్థితి ఏమవుతుందో?