.jpg)
నాని, సాయి పల్లవి కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్ ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
సాయి పల్లవి మంచి డ్యాన్సర్ అని అందరికీ తెలుసు కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసీగా నటించిన ఆమె క్లాసికల్ డ్యాన్స్ నిపుణులతో కలిసి డ్యాన్స్ చేయవలసివచ్చింది. దాని కోసం తాను క్లాసికల్ డ్యాన్స్ శిక్షణ తీసుకొన్నానని అయినా వారితో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు తాను ఎక్కడ తప్పులు చేస్తానో అనే భయం ఉండేదని చెప్పారు. కానీ ఆ భయాలను పక్కన పెట్టి ఎప్పటిలాగే ధైర్యంగా చేయడంతో అది చాలా బాగా వచ్చిందని సాయి పల్లవి చెప్పారు. లవ్ స్టోరీ సినిమా తరువాత మళ్ళీ ఈ సినిమాలో డ్యాన్స్ అంత సంతృప్తి కలిగించిందని చెప్పారు.
నానితో ఎంసీఏ సినిమాలో నటిస్తున్నప్పుడు ఏమాత్రం ప్రాధాన్యం లేని అటువంటి పాత్ర ఎందుకు చేస్తున్నానని అనిపించేదని, అప్పటి నుంచే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నానని చెప్పారు. శ్యామ్ సింగరాయ్‌లో చాలా బలమైన భావోద్వేగాలతో కూడిన దేవదాసి పాత్ర తనకు చాలా సంతృప్తి కలిగించిందని సాయి పల్లవి చెప్పారు.
తన చెల్లెలు పూజ సినీరంగంలో ప్రవేశించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “తనకు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉందని తెలుసు కానీ ఆమె ఇంత త్వరగా సినీ పరిశ్రమలోకి వస్తుందనుకోలేదు. ఇటీవలే ఆమె నటించిన ‘చితిరై సెవ్వానం’ అనే తమిళ సినిమా విడుదలైంది. నా చెల్లెలుగా కాక తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకొంటోందని సాయి పల్లవి చెప్పారు.