
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో కొన్ని ముఖ్య సన్నివేశాలను వికారాబాద్ జిల్లా, మదన్‌పల్లిలోని ఎల్లమ్మ ఆలయం వద్ద షూట్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ కారులో షూటింగ్ స్పాట్‌కి చేరుకొన్నారు. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి యువత భారీగా తరలివచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వారందరినీ పలకరించి షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు అభిమానులు ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిందాబాద్...’ అని నినాదాలు చేస్తుండటంతో ఆయన వారిని వారించి షూటింగ్ ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. షూటింగ్ విరామ సమయాలలో, ముగిసిన తరువాత ఆయన అభిమానులతో సెల్ఫీలు దిగుతుండటంతో వారి ఆనందానికి అవధులే లేవు. భీమ్లానాయక్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలియగానే దానిని చూసేందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొషీయుమ్’ చిత్రానికి తెలుగు రీమేక్ భీమ్లా నాయక్. దీనిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్‌ను సూర్యదేవర నాగవంశి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కావలసి ఉంది కానీ ఫిబ్రవరికి వాయిదా పడింది. ఫిబ్రవరిలో శివరాత్రికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం.
భీమ్లా నాయక్ ఫోటో గ్యాలరీ: https://www.mytelangana.com/telugu/gallery/55/