జనవరి 20 నుంచి బాలకృష్ణ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఘనవిజయం సాధించడంతో నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత నెల 13వ తేదీన జరిగాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. జనవరి 20 నుంచి ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ బాలకృష్ణతో జత కట్టబోతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్‌ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ ధమన్ సంగీతం అందిస్తారు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ వ్రాస్తున్నారు. 

అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, “కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రేక్షకులు అఖండ సినిమాను చూసి మాకు ఘనవిజయం అందించారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని చెప్పారు.