నేను జస్ట్ హీరోయిన్ కాదని పుష్పతోనే అర్ధమైంది: రష్మిక

పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జత కట్టిన అందాలభామ రష్మిక మందన ఆ సినిమా షూటింగ్‌లో తన అనుభవాలను, పలు ఆసక్తికరమైన విషయాలను ఓ ప్రముఖ తెలుగు మీడియాతో పంచుకొన్నారు. 

రష్మిక మాట్లాడుతూ, “సుకుమార్ సార్ నాకు మొదట ఫోన్‌ చేసి పుష్పలో చేయడం గురించి అడిగినప్పుడు, ఇది మొదలయ్యేందుకు మరి కొన్నేళ్ళు పడుతుందని అనుకొన్నాను. కానీ వెంటనే మొదలుపెట్టేసరికి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో శ్రీవల్లిగా డీ-గ్లామరైజ్ పాత్ర చేయాలని చెప్పినప్పుడు సుకుమార్ మీద నమ్మకంతో అంగీకరించాను. కానీ సినిమా షూటింగ్ జరుగుతున్నా కొద్దీ నా పాత్ర ఎంత గొప్పదో అర్ధమవసాగింది. చాలా సినిమాలలో నేను జస్ట్ హీరోయిన్ మాత్రమే కానీ ఈ సినిమాలో మాత్రం ‘నేను శ్రీవల్లిని’ అని గొప్పగా చెప్పుకోగలను. ఈ సినిమాలో రష్మిక కనబడదు...శ్రీవల్లి మాత్రమే కనబడుతుంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చేసిన తరువాత పుష్ప రెండో పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. అంతగా నచ్చింది నా పాత్ర. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే అనుకొంటున్నాను. ఈ పాత్రలోకి నన్ను నేను ట్రాన్స్‌ఫార్మేషన్ చేసుకొన్న తీరు చూసిన తరువాత ఇప్పుడు డీగ్లామరైజ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం భయపడకుండా రెడీ చెప్పేస్తాను,” అని అన్నారు. 

పుష్పలో రాయలసీమ యాసలో మాట్లాడటం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నేను కొత్తగా తెలుగు నేర్చుకొంటున్న ఈ సమయంలోనే రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాల్సివచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను. కానీ నేను దేనినైనా త్వరగా నేర్చుకోగలను కనుక రాయలసీమ యాసను త్వరగానే క్యాచ్ చేశాను. కనుక నా పాత్రకు పూర్తి న్యాయం చేశాననే భావిస్తున్నాను. పుష్పలో ‘సామీ... సామీ... తగ్గేదేలే...’వంటి పదాలు ఇప్పటికే జనాల నోళ్ళలో నానుతున్నాయి,” అని రష్మిక చెప్పారు.