ఆ పదకొండు మంది రాజీనామాలు ఆమోదం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌కు చెందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటిచారు. వారి రాజీనామాలు వెనక్కు తీసుకొని తమతో కలిసి పనిచేయాలని కోరామని కానీ వారు అందుకు అంగీకరించకపోవడంతో వారి రాజీనామాలు ఆమోదించానని చెప్పారు. ఖాళీ అయిన ఆ 11 స్థానాలలో తన ప్యానల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినవారిని తీసుకోబోతున్నట్లు మంచు విష్ణు చెప్పారు. 

జనవరి 1వ తేదీ నుంచి మా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. మా సొంత భవనం నిర్మాణ పనులకు సంబందించి కసరత్తు చేస్తున్నామని త్వరలోనే దాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మాలో సభ్యులందరికీ పని కల్పించడం, అందరికీ వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యాలని మంచు విష్ణు చెప్పారు.  

రాజకీయ ఎన్నికలకు తీసిపోనివిదంగా చాలా రసవత్తరంగా సాగిన మా ఎన్నికలలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మద్య హోరాహోరీగా పోరు జరిగింది. దానిలో ప్రకాష్ రాజ్ ప్యానల్లో 11 మంది గెలిచినప్పటికీ, చివరికి మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది. అప్పుడే ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన 11 మంది రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వారు తమ నిర్ణయం మార్చుకోకపోవడంతో వారి రాజీనామాలను మంచు విష్ణు నిన్న ఆమోదించారు.