ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్: 35ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఏపీలో మళ్ళీ సినిమా టికెట్ ధరలు పెంచుకొనేందుకు థియేటర్ యజమానులకు వీలు కలుగుతుంది. 

ఏపీ ప్రభుత్వం ఇటీవల సినీ నియంత్రణ చట్టం తీసుకువచ్చి, సినిమా టికెట్ ధరలకు కళ్ళెం వేసింది. దీంతో వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు, కోట్లు రూపాయలు చెల్లించి డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుకొన్న డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక కొందరు సినీ పెద్దలు ఏపీ మంత్రులను కలిసి దీనిపై పునరాలోచించవలసిందిగా విజ్ఞప్తి చేశారు కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన  జీవో నంబర్: 35ను సస్పెండ్ చేసింది. గతంలోలాగే పెద్ద సినిమాలు విడుదలైన తొలివారంలో టికెట్ ధరలు పెంచుకొనేందుకు థియేటర్ యజమానులను అనుమతించింది. 

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన పుష్ప రూ.250 కోట్లు పెట్టుబడితో నిర్మించారు. అది మరో మూడు రోజులలో రిలీజ్ కాబోతోంది. ఇటువంటి సమయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు పుష్ప నిర్మాతలకు చాలా ఊరటనిస్తుంది.