ఊ...వద్దు..ఊఊ అసలే వద్దు: హైకోర్టులో పిటిషన్‌

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప మరో మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమాలో సమంత ‘ఊ అంటావా...ఊఊ అంటావా మావా...’ అనే ఓ ప్రత్యేక గీతానికి డ్యాన్స్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ పాట లిరికల్ వీడియోకే యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ప్రేక్షకుల స్పందన ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. మత్తెక్కించే ఇంద్రావతి గొంతుతో పాడిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. దానికి సమంత చేసిన డ్యాన్స్‌ తోడైయింది కనుక థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు ఈ పాటకే ఆటంకం ఎదురయ్యేలా ఉంది. 

ఈ పాటలో ‘మీ మగబుద్దే వంకర బుద్ది...’ అంటూ సాగిన లిరిక్స్‌పై అభ్యంతరం చెపుతూ ఏపీ పురుషుల సంఘం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పాటలో లిరిక్స్ పురుషుల మనోభావాలను దెబ్బ తీసేవిదంగా ఉన్నాయని, సమాజంలో మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళే అన్నట్లు తప్పుడు అభిప్రాయం కలిగించేవిదంగా ఉందని కనుక సినిమాలో ఈ పాటను తొలగించాలని పిటిషన్‌ ద్వారా హైకోర్టును కోరింది. ఈ పాటకు డ్యాన్స్ చేసిన సమంతపై కూడా ఏపీ పురుషుల సంఘం వేరేగా కేసు వేసింది. మరి హైకోర్టు ‘ఊ అంటుందో... ఊఊ...అంటుందో’ చూడాలి.