
తెలుగు సినీ పరిశ్రమలో సిద్ధార్థ్ ఓ విలక్షణమైన నటుడు. ఆయన కూడా సినీ పరిశ్రమలో చాలామందిలాగే సామాజిక మాద్యమంలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల సమంత, తన అభిమానులలో కొందరు తనపై అసభ్యకరమైన బాషలో విమర్శలు చేస్తున్నారని, అందరికీ నచ్చినట్లు తాను ఉండలేనని కనుక ఎవరికైనా తనలో నచ్చని విషయం ఉంటే సభ్యతగా తెలిపితే బాగుంటుందని ట్వీట్ చేశారు. మరి కొద్దిసేపటికి సిద్దార్థ్ ఓ ట్వీట్ చేశారు.
“విషపూరితమైన సోషల్ మీడియాలో అభిమానులను మెయింటెయిన్ చేయడానికి, వారిని ఆయుధాలుగా ఉపయోగించుకోవడానికి కొంతమంది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏది దానంతట అది జరుగదు. కనుక తమ అభిమానులే తమను కాటు వేస్తారని ‘స్టార్స్’ తెలుసుకోవాలి,” అని ఆ ట్వీట్ సారాంశం.
గతంలో అంటే సమంత నాగ చైతన్యను వివాహమాడక మునుపు...సిద్ధార్థ్ ను ప్రేమించి, పెళ్ళికి సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. ఓసారి వారిద్దరూ శ్రీకాళహస్తిలో ప్రత్యేకపూజలు కూడా చేశారు. ఆ తరువాత సమంత సిద్దార్థ్ నుంచి విడిపోయి నాగ చైతన్యను వివాహం చేసుకోవడం, వారి అన్యోన్యంగా కాపురం చేస్తుండటం, వారి సినిమాలు వరుసగా సూపర్ హిట్ అవుతుండటంతో ఆ పాత విషయాలన్నీ క్రమంగా మరుగున పడ్డాయి. అయితే భగ్న ప్రేమికుడు సిద్ధార్థ్ మనసులో ఆ జ్వాల ఇంకా రగులుతూనే ఉన్నట్లుంది. అయితే ఆయన ఈ ట్వీట్ సమంతను ఉద్దేశ్యించి చేశారా లేక ‘కొందరు కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో అభిమానులను మెయింటెయిన్ చేస్తున్నారనడం’ అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశ్యించి చేశారా లేక పెద్ద హీరోలను ఉద్దేశ్యించి ఆ మాట అన్నారా?అనేది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఏది ఏమైనప్పటికీ, అగ్గిపుల్ల వంటి సోషల్ మీడియా ఎంత ప్రయోజనకరమో అంతే ప్రమాదకరమని మాత్రం చెప్పవచ్చు. అది సమంతకైనా...రేణు దేశాయ్‌కైనా...ఎవరికైనా సరే!