అమెరికాలో వెయ్యి థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్

బాహుబలి తరువాత దర్శకుడు రాజమౌళి చెక్కుతున్న మరో సినీ కళాకాండం ఆర్‌ఆర్‌ఆర్‌. జనవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఎల్లుండి అంటే గురువారం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఎటువంటి ముందస్తు ప్రకటన చేయకుండా సోమవారం సాయంత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లోని జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ పాత్రలకు సంబందించి పోస్టర్లను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాటిని చూసి జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ అభిమానుల ఆనందానికి అవదులే లేవు. పోస్టర్స్ ఇంత గొప్పగా ఉంటే ఇక ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 


రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అమెరికాలో 1,000కి పైగా మల్టీప్లెక్సు థియేటర్లను డిస్ట్రిబ్యూటర్లు బుక్‌ చేసి సిద్దంగా ఉంచారు. అమెరికాలో ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమా విడుదలవుతుండటం చూసి హాలీవుడ్ దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలో బాహుబలి రికార్డులను ఇంతవరకు మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది. దానిని జక్కన్న చెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీయే బద్దలు కొడుతుందేమో?